Disclaimer: Sources of this blog are different
online studies, videos and written solely in my own words in Telugu language.
Not sure if it is 100% authentic but tried putting the information in more
flawless manner. Any misguidance or wrong information is purely unintentional and pardon my ignorance. Sincere
apologies if I hurt anyone's beliefs and feelings.
ఈ మధ్య కాలం లో వచ్చిన మహాద్భుతమైన పాట 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలోని 'జరుగుతున్నది జగన్నాటకం'.ఈ పాటలో గురువుగారు సీతారామ శాస్త్రి గారు మహా విష్ణువు పది అవతారాల గురించి,వాటి ఉద్దేశ్యం, సారాంశాన్ని ఎంతో చక్కగా వివరించారు.దాదాపు తొమ్మిదిన్నర (9.23) నిముషాల నిడివి ఉన్న ఈ పాట వింటున్న ప్రతి సారి ఒళ్ళు గగుర్పోడిచేది. ఈ పాట విన్నాక, ఇలాంటి పాట రాయడానికే ఇన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమాల్లో పాటలు రాస్తున్నానని శాస్త్రి గారు చెప్పిన మాటలు అతిశయోక్తి కాదనిపించింది.నిజం చెప్పాలంటే విన్న మొదటి ఇరవై సార్లు ఈ పాట లోని సగం మాటలు అర్ధం కావు (నాకైతే అర్ధం కాలేదు..:)).
వింటున్న ప్రతిసారీ పాట అర్ధం గురించి, అసలు దశావతారాల చరిత్ర గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత నాలో రెట్టింపు అయ్యేది. దానిలో భాగంగానే దశావతార పురాణం తెలుసుకోవడం మొదలు పెట్టి, పరిపూర్ణంగా కాకపోయినా కొద్దిగా తెలుసుకోగలిగాను.దశావతారాల గురించి నేను తెలుసుకున్న ఈ కొద్ది జ్ఞానాన్ని మీతో పంచుకొనే ఉద్దేశ్యమే ఈ ప్రయత్నము :
1. మత్స్యావతారం : బ్రహ్మదేవుడు ధ్యానంలో ప్రవచిస్తున్న వేదాలను రాక్షస రాజు హయగ్రీవుడు విని తస్కరించెను. మహావిష్ణువు వాటిని తిరిగి బ్రహ్మ దేవుడికి ఇవ్వడానికి, విశ్వాన్ని జల ప్రళయం నుంచి కాపాడడానికి సత్య యుగం లో, తొలి అవతారంగా మత్స్యరూపంలో సత్యవ్రతుడనే మునికి దర్శనమిచ్చెను.భూలోకం ఏడు రోజుల్లో జల ప్రళయంలో మునిగిపోబోతోందని, ఈలోపు సప్తర్షులని, పశుపక్షాదులని, వృక్ష,ఔషదాలను కలుపుకొని సముద్ర ఒడ్డున నిలువమని, ఒక నావ వచ్చి అందరిని తోడ్కొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళునని సత్యవ్రతున్ని ఆదేశించెను.సత్యవ్రతుడు విష్ణువు చెప్పిన సమస్తంతో సాగర వొడ్డున ఎదురుచూడగా మత్స్యావతారం లోని శ్రీహరి హయగ్రీవుడిని సంహరించి, వేదాలను సంగ్రహించి, నావతో సత్య వ్రతునకు సాక్షాత్కరించెను .సమస్తాన్ని నావలో తోడ్కొని భయంకర జల ప్రళయం నుండి కాపాడుతూ, నావకు త్రోవను చూపిస్తూ సురక్షితంగా నవ లోకానికి తరలించెను. ఇది మత్స్యావతార కథ.
2. కూర్మావతారం : అమృతంతో అమరులవుదామని దేవతలు, రాక్షసులు వాసుకీ సర్పంతో మందర నామ పర్వత సహాయంతో క్షీరసాగర మథనం ఆరంభించెను. సముద్ర లోతునకు, అలల తాకిడికి తట్టుకోలేక మందర పర్వతం మునగసాగెను. ఈ పరిణామాన్ని చేధించడానికి విష్ణు దేవుడు కూర్మావతారంలో పర్వత అడుగున నిలిచి దాన్ని మునగకుండా బరువు మోస్తూ కాపాడసాగెను. ఈ సహాయం తో మళ్ళీ ఆరంభమైన మథనంలో ముందు చిమ్మిన హాలాహలాన్ని ఈశ్వరుడు మ్రింగగా, తర్వాత వచ్చిన లక్ష్మి దేవిని విష్ణువు పరిణయమాడగా, ఐరావతం,కామధేనువు,మొదలైన వాటిని ఇంద్రుడు వశము చేసుకొనెను. తదుపరి అమృత కలశంతో ధన్వంతరి సాక్షాత్కరించెను. ఇది చూసిన రాక్షసులు ఒక్క ఉదుటున ముందుకు దుమికి అమృతము త్రాగ ప్రయత్నించగా మోహిని రూపంలో విష్ణువు వారి దృష్టి మరల్చి దేవతలకు సుధని పంచెను.ఇదీ క్షీర సాగర మథనాన్ని ఓరిమితో బరువు మ్రోసి, ముందుకు నడిపిన మహా విష్ణువు కూర్మావతార కథ.
3. వరాహావతారం : బ్రహ్మ దేవుడి వరప్రసాదం తో రాక్షసుల రాజు హిరణ్యాక్షుడు భూమాతను అపహరించి పాతాళ లోకంలో దాచిన సమయాన విష్ణువు వరాహావతారం ఎత్తి భూతలాన్ని సరైన స్థానంలో నిలుప సముద్ర గర్భానికి పయనించసాగెను. అడుగున చేరిన ఆదివరాహం, ధరణిని తన కొమ్ములఫై నిలిపి పైకి రాసాగెను.ఇది విన్న హిరణ్యాక్షుడు ఆగ్రహంతో వరాహాన్ని దండించ బయలుదేరెను. భూ తల్లిని, సకల చరాచరిని రక్షించ వరాహుడు వేల సంవత్సారాల పాటు జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని తిరిగి విశ్వంలో సరైన స్థానంలో నిలిపెను.
4. నరసింహావతారం : హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశపుడు తన అన్న సంహారంతో కలత చెంది విష్ణువును ఓడించి, ముల్లోకాలను జయించ తలచెను. దీని కోసం ఘోర తపస్సు తో బ్రహ్మ దేవుడి అనుగ్రహం పొంది ' జంతువు వల్ల కానీ, పక్షి వల్ల కానీ, పగలు కానీ, రాత్రి కానీ ,ఇంట్లో కానీ, ఆరు బయట కానీ, భూమి పైన కానీ,స్వర్గం లో కానీ చంపబడకుండా ఉండే వరాన్ని పొందెను.తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద ముని చెప్పిన విష్ణువు కథ విన్న హిరణ్యకశపుడి పుత్రుడు ప్రహ్లాదుడు హరి నామస్మరణతో పెరుగ సాగెను.ముల్లోకాలపై దండయాత్ర మొదలు పెట్టిన హిరణ్యాక్షుడు తన కుమారుడు హరిని పూజించటాన్ని మిక్కిలి క్రోధంతో ఖండించెను.ఇది జరుగ వీలు లేదని, 'ఏడి నీ హరి, ఎక్కడ నీ హరి' అని ప్రహ్లాదుని ప్రశ్నించెను. దానికి భక్త ప్రహ్లాదుడు 'శ్రీహరి ఇందుగలడు, అందులేడని తలచడం ముర్ఖత్వమని, ఎందెందు వెదికిన అందందు కలడు' అని హరిని పూజించసాగెను.' అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి, ఉంటే నా ముందుకు రాగలడా, వచ్చి బ్రతకగలడా' అని రాక్షసుడు గద్దించెను.హిరణ్యాక్షుడి సంహారానికి సమయం ఆసన్నమయింది అని గ్రహించిన శ్రీహరి అత్యంత భయంకర నృసింహావతారంలో స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యక్షుడిని సంహరించెను. బ్రహ్మదేవుడి వర గర్వమొనర్చక శ్రీహరి ఇలలో కాకుండా, స్వర్గంలో కాకుండా తన తొడల పై పడుకోబెట్టి, ఇంట్లో కాకుండా, ఆరు బయట కాకుండా ఇంటి గుమ్మం పై కూర్చొని, జంతువూ కాకుండా, పక్షి కాకుండా, మనిషీ కాకుండా, నరహరి రూపంలో, పగలు కాక, రాత్రి కాక ,సాయం సంధ్యా వేళ హిరణ్యాక్షుడిని సంహరించి లక్ష్మి నరసింహుడి గా పేరుపొందెను.
5. వామనావతారం : భక్త ప్రహ్లాదుని మనవడైన బలి రాక్షస రాజు అయ్యెను.తన బలంతో స్వర్గాన్ని ఆక్రమించెను.దేవతల ప్రార్థన ఆలకించిన శ్రీహరి సకల దేవతల మాత అయిన ఆదితి గర్భాన వామనుడిగా జన్మించెను.బలి ముల్లోకాలకు చక్రవర్తి అవ్వ తలచి అశ్వమేధ యజ్ఞాన్ని ఆరంభించెను. ఆ సమయంలో అక్కడికి చేరిన వామనుడిని చూసిన బలి ఏమి కావాలో కోరుకొమ్మనగా, తనకు మూడు అడుగుల నేలను ప్రసాదించమని వామనుడు కోరెను.అత్యంత దానశీలుడైన బలి, గురువు శుక్రాచార్యుడి మాటను పెడచెవిన పెట్టి వామనుడికి దానం ప్రసాదించెను.వామనుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు అనంతంగా ఎదిగి ఒక అడుగుతో భూప్రపంచాన్ని, మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించెను.మూడో అడుగు కోసం బలి తన శిరస్సు చూపగా, ప్రహ్లాదుడు తన మనవడిపై దయ చూపమని వామనుని ప్రార్థించెను.అందుకు వామనుడు 'బలి రాక్షసుడైనా, దైవ గుణం మెండుగా ఉన్న కారణాన పాతాళ లోకానికి రాజును చేసెదనని, పిమ్మట స్వర్గ లోక ప్రవేశం పొందెదడని' చెప్పెను. ఈ విధంగా బలి నిర్మూలనకు విష్ణువు వామనావతారము ఎత్తెను.
6. పరశురామావతారం : జమదాగ్ని, రేణుక దంపతులకు ఐదవ సంతానంగా విష్ణువు ఆరో అవతారం ఎత్తెను.ఘోర తపస్సుతో శివుడిని మెప్పించి పరశు(గొడ్డలి)ని వరంగా పొంది పరశు రాముడయ్యేను. కర్తావీర్యుడను క్షత్రియ రాజు అరాచకాలకు పాల్పడుతూ క్రూర రాజ్య పాలన చేయసాగెను.ఒక రోజు సమస్త సైన్యం తో అటుగా వెళ్ళుచున్న రాజు జమదాగ్ని ఇంట సేద తీరగా, వచ్చిన అతిధులకు తన దివ్య శక్తితో జమదాగ్ని దగ్గరున్న కామ ధేనువు సేవలందించెను. ఇది చూసి అత్యాశతో రాజు తనకు కామధేనువుని ఇమ్మని జమదాగ్నిని గద్దించగా దానికి అతను నిరాకరించెను.ఆగ్రహించిన రాజు కామధేనువుని బలవంతంగా తీసుకొని వెడలెను. ఇది తెలిసిన పరశురాముడు ఆగ్రహంతో కర్తావీర్యుడిపైకి దండెత్తి వెళ్లి సమస్త సైన్యాన్ని, రాజుని ఒంటి చేతితో సంహరించి కామధేనువుతో వెనుతిరిగెను.ఇది జరుగుతున్న సమయాన జమదాగ్నిని కర్తావీర్యుడి పుత్రులు చంపెను. ఇంటికి వచ్చి తల్లి రేణుక ద్వారా విషయం తెలుసుకున్న పరశురాముడు కోపోద్రిక్తుడై సమస్త క్షత్రియ జాతి నిర్మూలనకి ప్రతిన బూని ఒక్కొక్కరుగా జగతి లోని రాజు లని, వారి సంతానాన్ని సంహరించసాగెను. కోపోద్రిక్తుడైన పరుశురాముడిని రిచికా మహర్షి చివరికి శాంతింపజేసెను.ఇది పరశురాముడి కథ.
7. శ్రీరామావతారం : దశావతారాల్లో నాకు అత్యంత ఇష్టమైన శ్రీరామావతారం, మహావిష్ణువు త్రేతా యుగంలో దాల్చెను.శంకరుడికి మహా భక్తుడైన లంకా మహారాజు రావణుడు అరాచాలకు హద్దులు లేక మానవులను, దేవతామునులను హింసించసాగెను.దేవతలు విష్ణువు దగ్గరికి వెళ్లి శరణుకోరగా శ్రీ రాముని అవతారం లో రావణుని సంహరించెదనని శ్రీహరి అభయమిచ్చెను. దశరథ మహారాజు కి తొలి సంతానంగా జన్మించి, సకల విద్యలు నేర్చి, శివధనుర్భంగముతో సీతాదేవిని వివాహమాడెను.తండ్రి మాటకు కట్టుబడి పధ్నాలుగేళ్ళ వనవాసానికి సీతా లక్ష్మణులతో బయలుదేరెను శ్రీరాముడు. కుటిల నీతి తో వచ్చిన సూర్పనకను ముక్కు చెవులు కోసి లక్ష్మణుడు వెనక్కి పంపగా, వెళ్లి రావణుడికి మొరపెట్టుకొనేను. ఆగ్రహించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతనపహరించి లంకకు తీసుకొని వెళ్లి నిర్భందించెను.వానర రాజు సుగ్రీవుడు, వానరోత్తముడు శ్రీ ఆంజనేయుడి సహాయం తో సీత లంకనున్నదని గ్రహించిన శ్రీరాముడు వానర సేన, లక్ష్మణుని తోడ్కొని లంక పై దండించెను. రావణ సోదరులైన ఇంద్రజిత్తు, కుంభకర్ణులను రామలక్ష్మణులు వదించెను. పిదప రావణుడిని సంహరించి శ్రీరాముడు సీతతో అయోధ్యకు బయలుదేరెను. అయోధ్య చేరిన రాముడు రాజ్యపాలన చేస్తూ భూలోకంలోనే గొప్ప మహారాజుగా ప్రశంసలందుకొనెను. ఇది సూక్ష్మ రూపంలో శ్రీ రామాయణ కథ.
8. కృష్ణావతారం : అత్యంత క్రూరుడైన కంస రాజును సంహరించి లోక ధర్మాన్ని కాపాడ మహావిష్ణువు శ్రీకృష్ణుడి అవతారం పొందెను. సోదరి దేవకీ, వసుదేవుల సంతానంతో ప్రాణహాని ఉందని గ్రహించిన కంసుడు ఇరువురిని బంధించి వారికి పుట్టిన ఏడుగురు సంతానాన్ని పురిటి లోనే హతమార్చెను. ఎనిమిదవ సంతానంగా జన్మించిన కృష్ణుని వాసుదేవుడు యశోద మాత చెంత చేర్చెను. పెరిగి పెద్దవారైన బలరాములని కంసుడు సంహరించ తలచి రాజ్యానికి ఆహ్వానించి బలవంతులైన యోధులతో వారిని పోరాడమనేను. వారిని త్రుటిలో ఓడించిన కృష్ణుడు కంసుని కూడా వదించి ధర్మాన్ని కాపాడెను. దాని యెడల మహా భారత యుద్ధం లో పాండవుల పొంత చేరి, అర్జునుడి రథ సారథిగా వ్యవహరించెను.భగవద్గీత సారమిచ్చి లోకానికి ఇలవేల్పు అయ్యెను శ్రీకృష్ణుడు.
9. బుద్ధావతారం : సక్య వంశానికి చెందిన సుద్దోదనుడికి, మహా మయరాణికి సిద్ధార్థునిగా లోకంలో జరుగుతున్న హింసను, అరాచకాలను అహింస తో జయించ తొమ్మిదవ అవతారంలో జన్మించెను శ్రీహరి.రాజ్య నగరంలో సంచరిస్తున్న సమయాన తను చూసిన వృద్ధురాలు,బిచ్చగాడు,శవ యాత్రలతో తీవ్ర కలత చెంది రాజ్యాన్ని వీడి నిజమైన జ్ఞానాన్ని పొంద అరణ్యానికి బయలుదేరెను.జన జీవ జాతిని, పశు పక్షాదులను హింసించక జీవశాంతిని పునరుద్ధరించే మహత్కార్యం తలచెను గౌతముడు.బోధ వృక్షం క్రింద ఘోర తపస్సుతో జ్ఞాన సంపన్నుడై, సత్య ధర్మ నిర్వానం చెంది గౌతమబుద్ధుడుగా పేరు పొందెను. లోకానికి అహింసా మార్గాన్ని తెలిపి బౌద్ధ మత స్థాపకుడాయెను.'బుద్ధం శరణం గచ్ఛామి' అంటూ మానవాళి బుద్ధుడిని పూజించసాగెను.ఇది బుద్ధుడి చరిత్ర.
10. కల్కి అవతారం : కలి యుగంలో మానవ జాతి ఆగడాలు హద్దులుమీరి, సత్యాన్ని అసత్యం, న్యాయాన్ని అన్యాయం జయిస్తూ,స్వార్థపూరిత మానవుడు సాటి మానవుడిపై దాడులు జరుపుతూ విశ్వాన్ని అల్లకల్లోలం చేయసాగెను.మానవుడు సృష్టిస్తున్న ఘోర కలిని రూపుమాప, పాపుల సంఖ్య నిండగ,సజ్జనుల రక్షణకు, దురాచారుల సంహారానికి కల్కి రూపంలో భూమి పై అవతరించెదనని శ్రీహరి చెప్పెను. అగ్ని అశ్వం పై సంచరిస్తూ, సత్యం న్యాయంతో కూడిన ఖడ్గాన్ని చేత పూని, దుష్టులను సంహరించి,పాప ప్రక్షాళన చేసి, సత్యంతో కూడిన లోకానికి మానవాళిని తీసుకు పోయెదనని విష్ణువు సెలవిచ్చెను.
ఇదీ క్లుప్తంగా దశావతారాల చరిత్ర.
ఇంత గొప్ప చరిత్రను ఒక్క పాటలో అత్యద్భుతంగా వర్ణించిన గురువుగారు సీతారామశాస్త్రికి, ఈ పాట అర్థాన్ని తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికి ఇది అంకితం.
Hi Kishore,
ReplyDeleteIn Mathsyavataram you mentioned rakshasa name as "Hayagreeva". It's not "Hayagreeva" the rakshasa name is "Somakasura or Somakasurudu" he has the face of Horse.
Hayagreeva is one of the avatar of "Sri Maha Vishnu"..
Hi Kishore,
ReplyDeleteIn "Narasimha Avatar" Hiranyaksha was the younger brother of "Hiranyakasyapa". However it was mentioned as elder brother.